Oct 13,2023 22:57

ప్రజాశక్తి-కాకినాడ దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాల కోసం కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ సూర్య కళామందిరంలో ఈ నెల 15వన నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి దళిత సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్‌లో రాష్ట్ర దళిత సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర దళిత సదస్సులో ముఖ్యంగా మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసే కుట్రలను చేస్తున్న మతోన్మాద శక్తుల కుయుక్తులను తిప్పి కొట్టడం, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ, జస్టిస్‌ పున్నయ్య కమిటీ సిఫార్సులు అమలు, అంటరానితనంపై ప్రభుత్వమే క్యాంపెయిన్‌ నిర్వహించేలా డిమాండ్‌, పక్కదారి పట్టించిన సబ్‌ ప్లాన్‌ నిధులను తిరిగి దళితుల అభివద్ధికి కేటాయించేలా చేయడం, శ్మశాన స్థలాలు లేని దళితులకు 1235 జిఒ ప్రకారం శ్మశాన వాటికల కోసం భూమి కొనుగోలు చేసి ఇచ్చేలా ప్రయత్నించడం, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి గహ నిర్మాణానికి రుణం ఐదు లక్షలకు పెంచడం, ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు హత్యలు స్త్రీలపై అత్యాచారాల కేసులను విచారించడానికి జిల్లాలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు తదితర చాలా సమస్యలపై ఈ రాష్ట్ర సదస్సులో చర్చిస్తామన్నారు. ఈ సదస్సులో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు మేధావులు పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, కెవిపిఎస్‌ కాకినాడ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం పాల్గొన్నారు.