Nov 11,2023 20:55

మాట్లాడుతున్న ఎపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌     ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 15న ఏపిటిఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపిటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు పిలుపునిచ్చారు. శనివారం ఉపాధ్యాయ భవన్‌లో ఎపిటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రాయల్‌ వెంకటేష్‌ నిర్వహించిన జిల్లా శాఖ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి.నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆర్థికపరంగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. శాంతియుత నిరసనలు తెలియజేసే స్వేచ్చను కూడా హరిస్తోందని, ఎక్కడికక్కడే నిర్బంధిస్తూ ఉద్యమాన్ని నీరుగారిస్తోందని విమర్శించారు. నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి డిఏ కూడా చెల్లించలేదన్నారు. 149 నెలల డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని, 11వ పిఆర్‌సిలోని అనేక బకాయిలను చెల్లించకుండానే 12వ పిఆర్‌సి నియమిస్తూ ఉత్తర్వులకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. సుమారు రూ.30 వేల కోట్లు పైబడి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉందన్నారు. విద్యా రంగానికి నష్టం కలిగించేలా ఉన్న 117 జిఓను రద్దు చేసి గ్రామీణ విద్యాభివద్ధికి పాటు పడాలని కోరారు. ఇంటీరియర్‌ రిలీఫ్‌ను వెంటనే ప్రకటించాలన్నారు. 15న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు డి.ప్రబాకర్‌, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్‌, గౌరవ సలహాదారు బి.వెంకటేషులు, జిల్లా ఉపాధ్యక్షులు డేనియల్‌, నాగరాజు, బొమ్మయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు సర్దార్‌ వలి, సతీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.