Nov 08,2023 21:29

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ

ప్రజాశక్తి-కలెక్టరేట్‌  : అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధితోపాటు రాష్ట్ర, మన్యం జిల్లా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేపడుతున్న ప్రజా రక్షణభేరిలో భాగంగా ఈ నెల 15న విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ తెలిపారు. బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో కరువు తీవ్ర స్థాయిలో ఉందన్నారు. తీవ్ర వర్షాభావం ఉన్న కురుపాం, పార్వతీపురం, గుమ్మలకీëపురం మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఈ ప్రాంతాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని కోరారు. విద్య, వైద్య, రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచాలని, పార్వతీపురం, గిరిజన ప్రాంతంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మించాలన్నారు. పూర్ణపాడు-లాభేసు వంతెన పోరాట సందర్భంగా పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం విలువలు, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని సమగ్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన బిజెపి విధానాల్ని తిప్పికొట్టాలని సిపిఎం ప్రజా రక్షణ బేరి యాత్రలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా జరిగే బహిరంగ సభకు జిల్లా ప్రజలంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ జిల్లాలో కరువు ప్రభావం అంచనాను గ్రామాల ప్రాతిపదికన సత్వరంగా చేపట్టాలని, రైతులను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొల్లి గంగునాయుడు, కోలక అవినాష్‌, జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ పాల్గొన్నారు.