ప్రజాశక్తి-గుంతకల్లు ప్రజా సమస్యలపై వచ్చేనెల 15న ప్రజా రక్షణభేరి పేరుతో పేరుతో తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హంపిరెడ్డి భవనంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడగొట్టి పదేళ్లు కావస్తోందన్నారు. అయినా కేంద్రంలోని బిజెపి పెద్దలు ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టుకు నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ, అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, కుదిరే ముక్ పరిశ్రమ,నాసా బెల్ కంపెనీ వంటివి అమలు చేయలేదన్నారు. అంతేగాకుండా బిజెపి పాలనలో మొత్తం దేశమే అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మరోపక్క వైసీపీ ప్రభుత్వం కూడా మోడీ చెప్పిన వాటికి తలఊపుతూ ప్రజల పైన అనేక భారాలు మోపుతోందని విమర్శించారు. ఆస్తి, చెత్త పన్నులు, విద్యుత్ ఛార్జీల భారాలు, రైతుల మోటర్లకు మీటర్లు రకరకాల పేర్లతో ప్రజలపై అనేక భారాలు మోపుతోందన్నారు. బిజెపి, వైసిపి దుర్మార్గమైన పాలనపై పోరాటానికి ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆయా సమస్యలను పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు మారుతీప్రసాద్, జగ్గలి రమేష్, సాకే నాగరాజు, కసాపురం రమేష్, పట్టణ కమిటీ నాయకులు బి.చంద్ర, బి.తిమ్మప్ప, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వెంకీ, చెర్రీ, తదితరులు పాల్గొన్నారు.
గోడపత్రికలను విడుదల చేస్తున్న సిపిఎం నాయకులు










