
- సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి నరసింహారావు
ప్రజాశక్తి-చల్లపల్లి: ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు పిలుపునిచ్చారు. స్థానిక శ్రామిక గుంటూరు బాపనయ్య భవనంలో మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ఫైర్లు ఎండిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల దగ్గర పడటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించలేదన్నారు. ఇటీవల కాలంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు. దళితులను ఏం ఉద్ధరించారని వైసీపీ ప్రభుత్వం సామాజిక బస్సు యాత్ర ప్రారంభించిందని ప్రశ్నించారు. మోపిదేవి మండలంలో గిరిజన మహిళపై దొంగతనం నేరం వేసి చితకబాదిన వైసిపి నాయకుడుకు బెయిల్ రావడం దారుణమన్నారు. ట్రూ అప్, సర్జుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ రేట్లు పెంచి పేదలపై భారం మోపారని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగి ఉంటే నేడు పంట పొలాలు ఎండిపోయేవి కాదన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపికి అనుకూలమన్నారు. మహమ్మద్ కరీముల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కార్యదర్శి యద్దనపూడి మధు, మేడంకి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు వాకా రామచంద్రరావు, బండారు కోటేశ్వరరావు, మేడేపల్లి వెంకటేశ్వరరావు, తలారి నాగేశ్వరరావు, అవనిగడ్డ సాంబయ్య, గోళ్ల సాంబశివరావు, రేపు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా రక్షణ భేరి రాష్ట్ర జాత ఈ నెల పదో తేదీన చల్లపల్లికి రానున్న సందర్భంగా దివితాలూక అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న పనులను వై.నరసింహారావు, యద్దనపూడి మధు, కరీముల్లా, మేడంకి వెంకటేశ్వరరావు, వాకా రామచంద్రరావు పరిశీలించారు.