Nov 11,2023 01:10

నక్కపల్లిలో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రజా రక్షణ భేరిలో భాగంగా ఈనెల 15న సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు పిలుపునిచ్చారు. నక్కపల్లిలో పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.అప్పలరాజు మాట్లాడుతూ,అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 18 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని వేసిన వరి ఇతర పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. అయినప్పటికి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకుండా జిల్లా రైతాంగానికి తీవ్రంగా ద్రోహం చేశారన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను, కూలీలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్‌, ఎం.శివాజీ, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
రోలుగుంట:ఈ నెల 15న సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు పిలుపునిచ్చారు. రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పిత్రిగడ్డ, పెద్దగరువు, ఆర్ల, పనసలపాడు, గదబపాలెం గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ, గిరిజన సాగు భూములో గిరిజనేతరులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారస్తులు స్థానిక రెవిన్యూ అధికారులు కుమ్మక్కై గిరిజన సాగు భూముల నుండి వెలుగొట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.కొండబాబు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కె.కోటపాడు : విజయవాడలో ఈనెల 15వ తేదీన జరుగు ప్రజా రక్షణ భేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు గండి నాయన బాబు, ఎర్ర దేవుడు మండలంలోని గొండుపాలెం, కె.కోటపాడు గ్రామాలలో శుక్రవారం ప్రచారం నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు వత్తాసు పలకడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వనుము సూర్యనారాయణ, పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : ప్రజా రక్షణ బేరి మహాసభను జయప్రదం చేయాలని సిపిఎం అచ్యుతాపురం కన్వీనర్‌ ఆర్‌.రాము పిలుపునిచ్చారు. పూడిమడక కుమారపురం గ్రామాలలో శుక్రవారం గ్రూప్‌ మీటింగ్‌ నిర్వహించి ప్రచారం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలతో పాటు ప్రతిపక్షాలు ఘోరంగా విఫలం చెందుతున్నాయని పేర్కొన్నారు.
ములగాడ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్న అన్యాయంపై, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజారక్షణభేరి యాత్ర ముగింపుగా ఈనెల15న విజయవాడలో నిర్వహించే బహిరంగసభకు తరలిరావాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం 61వవార్డు మల్కాపురం పల్లివీధి, గొల్లవీధిలలో కరపత్రాలు పంచుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా పల్లివీధిలో సిపిఎం మల్కాపురం జోన్‌ నేత ఆర్‌.విమల మాట్లాడుతూ, విభజన హామీల అమలు, ఇతరత్రా విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వైసిపి, టిడిపి, జనసేనలను ప్రజలంతా నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్‌.ఉమా, మాధురి, అమ్మాయమ్మ, నాగరత్నం, తులసి పాల్గొన్నారు.