
ప్రజాశక్తి -ఆనందపురం : అగ్రిగోల్డ్ బాధితుల న్యాయ పోరాటానికి ఈ నెల 15 విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వస్తున్నట్లు ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఆనందపురం కూడలిలో ఆదివారం చలో విజయవాడ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ ఏజెంట్‌లు కోరాడ ఆదినారాయణ, సన్యాసిరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో 32 లక్షల మంది కష్టార్జితాన్ని అగ్రిగోల్డ్ గజ దొంగలు దోచుకున్నారన్నారు. వీరి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి నేడు మడమ తిప్పారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. అనందపురం మండలంలో సుమారు పదివేల మంది బాధితులు సుమారు రూ.3 కోట్లు పైన అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ఈ 15న విజయవాడలో జరుగే భారీ బహిరంగ సభకు బాధితులందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్లు మీసాల నర్సింగరావు, బాలి రవికుమార్, దొంతల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.