జవాబుదారీతనంతో గిరిజనులకు సంక్షేమ పథకాలందించండి
అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవు
ఐటిడిఎ పాలకవర్గ సమావేశంలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు
ప్రజాశక్తి - కెఆర్.పురం(బుట్టాయగూడెం)
గిరిజన గ్రామాల్లో వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులను వచ్చేనెల 15వ తేదీలోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని, లేకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఐటిడిఎ సమావేశపు హాలులో బుధవారం జరిగిన ఐటిడిఎ పాలకవర్గ సమావేశంలో గిరిజన మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రజలకు మెరుగైన విద్య, వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిస్తుందన్నారు. ఐటిడిఎ పరిధిలో 37 వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లను 15వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉండగా, పనుల్లో పురోగతి లేకపోవడం, మనబడి నాడు-నేడు పనులు కూడా నత్తనడకన కొనసాగడంపై గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులు తమ వైఖరిని మార్చుకుని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో సస్పెన్షన్‌లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి అమలు చేస్తున్న పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలన్నారు. ఐటిడిఎ పరిధిలో చేపట్టే పనులను ప్రాజెక్ట్ అధికారి దృష్టికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించాలని సూచించారు. పోలవరం నియోజకవర్గంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలను ఆ ప్రాంతంలో ప్రజాప్రతినిధులు పరిశీలించాలన్నారు. గిరిజన గ్రామాల్లో మలేరియా, డెంగీ వంటి విష జ్వరాలు ప్రబలకుండా నిరంతరం మలాథియాన్ ఫాగింగ్ చేయించడం, పూర్తి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మెరుగైన వైద్య సేవలందించే దిశగా వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. గర్భిణులకు, పిల్లలకు రక్తహీనత, తదితర ఆరోగ్య సమస్యలు లేకుండా అంగన్‌వాడీ, ఎఎన్‌ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటిడిఎ పరిధిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు ప్రాజెక్ట్ అధికారి ప్రతినెల గిరిజన మండలాల అధికారులతో సమీక్షించాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతర్వేది గూడెం, తెల్లంవారిగూడెం, బర్రింకలపాడు, కోయ రాజమండ్రిలో ప్రభుత్వ పాఠశా లల మీదుగా వెళ్లిన 11కెవి విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని తొలగించాలని సభ్యులు కోరగా వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారు లను కలెక్టర్ ఆదేశించారు. పునరావాస ప్యాకేజీలో భాగంగా నిర్వాసితులకు అందిం చిన భూమికి భూమి పరిహారంలో వేరే ప్రాంతంలోని గిరిజనులు వచ్చి శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒని కలెక్టర్ ఆదేశించారు. జగనన్న ఇళ్లు పథకంలో భూసేకరణకు సంబంధించి కోర్టుల్లోని పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాయని, వీటి అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చేతిపుంపులు ఏర్పాటు చేయాలన్నారు. పోగొండ రిజర్వాయర్ నుండి సాగునీరు అందించేందుకు ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు. పెద్దవాగు ప్రాజెక్ట్ ద్వారా సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా డెంగీ, మలేరియా జ్వరాల వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. గిరిజన మండలాల్లో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పోలవరం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల్లో జగనన్న ఇళ్లు పథకంలో కొంతమంది అర్హులకు ఇంకా ఇళ్లు మంజూరు కాలేదని, వారికి కూడా కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, జిల్లా అటవీ శాఖాధికారి అరవింద్ దామా, జిల్లా పరిషత్ సిఇఒ కె.రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాధ్, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి రాజు, జిల్లా వ్యవసాయాధికారి వై.రామకృష్ణ, డిఎంహెచ్‌ఒ డాక్టర్ డి.ఆశ, గిరిజన మండలాల ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










