రాయచోటి ; రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను సెప్టెంబర్ 15 లోపల పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో పంచాయతీరాజ్ శాఖ ఇఇలు, డిఇలు, ఎఇలతో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ గిరీష పిఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. అధికారులు అందరూ ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకొని గ్రామ సచివాలయాలు, వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో నిర్లక్ష్యం చూపకుండా అత్యంత ప్రమాణాలతో రూపుదిద్దు కొనేటట్లుచూడాలన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించి రోజురోజుకూ పురోగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులను పరిశీలించాలన్నారు. జరిగిన పనులకు బిల్లులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు వివిధ సేవలు అందిస్తుందని ప్రయివేట్ భవనాలలో ఉండే గ్రామ సచివాలయాలను ప్రభుత్వ భవనాలలోకి మార్చేందుకు సచివాలయ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు ఎరువులు, పురుగు మందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేస్తారని తెలిపారు. అధికారులు ఆర్‌బికెల భవన నిర్మాణాలలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. గ్రామాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ఈ భవన నిర్మాణాలకు ఎటువంటి సమస్య లేకుండా నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయాలు 366 కు గాను 227 పూర్తి చేశారని చెప్పారు. ఇంకా 139 భవనాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. రౖతు భరోసా కేంద్రాలు 319కి గాను 179 పూర్తి చేశారని, ఇంకా 146 భవనాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ లు 212 కు గాను 97 భవనాలు పూర్తి చేశారని, ఇంకా 115 భవనాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. వీటన్నింటినీ సెప్టెంబర్ 15వ తేదీ లోపల పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్‌ఇ దయాకర్ రెడ్డి, మదనపల్లె ఇఇ చంద్రశేఖర్ రెడ్డి, రాజంపేట ఇఇ రామచంద్ర, పంచాయతీ రాజ్ డిఇలు, ఎఇలు పాల్గొన్నారు.










