Sep 24,2023 21:56

- ప్రజాశక్తి, విజయనగరం ప్రతినిధి: ఉపాధి హామీ ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 1.56లక్షల పనిదినాలు కల్పించామని డ్వామా పీడీ ఉమామహేశ్వరి తెలిపారు. వీరికి రూ.377.29కోట్ల మేర వేతనాలు చెల్లించామని స్పష్టం చేశారు. వ్యవసాయ పనులవల్ల ప్రస్తుతం ఉపాధి పనులు తగ్గాయని, సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఉపాధి పనులు చేయాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఇంకుడుగుంతలు తవ్వడం, మొక్కలు నాటడం వంటి పనుల్లో కూలీలను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. జలకళ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 370 బోర్లు వేశామని, వాటికి చెల్లింపులు కూడా జరిగాయని అన్నారు. ఈ వారం తనను కలిసిన ప్రజాశక్తికి ముఖాముఖీ ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే....

జిల్లాలో జాబ్‌కార్డులు ఎన్ని? ఇప్పటి వరకు ఎన్ని పనిదినాలు ఉపయోగించుకున్నారు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 3.51 లక్షల జాబ్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కో కార్డుపై ఆ కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురు వరకు పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం వారు పని కోరిన వెంటనే కల్పిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, పని కల్పించడంలో మన జిల్లా దేశానికే ఆదర్శం. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.50లక్షల పనిదినాలు కల్పించాల్సివుండగా 1.56లక్షల పనిదినాలను కూలీలు ఉపయోగించుకున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో కూలీలకు చెల్లించిన మొత్తం ఎంత? బకాయి ఏమైనా ఉంది.
ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సంబంధించి రూ.377.29కోట్ల మేర కూలి డబ్బులు చెల్లించాం. ఇంకా రూ.23.40 కోట్ల మేర చెల్లించాల్సివుంది. నిబంధనల ప్రకారం ప్రతి వారం చెల్లింపులు జరుగుతున్నాయి.
ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయి?.
వర్షాలు, వ్యవసాయ పనుల నేపథ్యంలో గత రెండు నెలలుగా పనిదినాల సంఖ్య తగ్గింది. సంక్రాంతి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికులు, చిన్నరైతులే ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఖరీఫ్‌లో ఉబాలు ప్రారంభం మొదలు నాట్లు, కలుపు తీయడం, కోతలు, వరిచేను నూర్పులు వంటి పనుల్లో ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి సంక్రాంతి తరువాత మళ్లీ ఉపాధి పనులు ఊపందుకుంటాయి. ఈలోపు పని కావాలనుకున్న వారందరికీ కల్పిస్తున్నాం.
ప్రత్యామ్నాయ పనులు ఏమీ లేవా?
ప్రస్తుతం ఇంకుడు గుంతల తవ్వకాలు మొదలుపెట్టాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఆర్‌బికెల్లో తవ్వకాల కోసం ప్రణాళిక సిద్ధమైంది. కొన్ని చోట్ల తవ్వకాలు మొదలవుతున్నాయి. మొక్కలు నాటే కార్యక్రమం కూడా సాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగనన్న భూ సర్వేలో భాగంగా స్టోన్‌ ప్లాంటేషన్‌కు కూడా అవసరమైన మేరకు కూలీలను పంపుతున్నాం.
ఈ ఏడాది ఎన్ని మొక్కలు నాటేందుకు నిర్థేశించుకున్నారు? అమలు ఎంత వరకు వచ్చింది?
రోడ్ల, కాలువలకు ఇరువైపులా 100కిలో మీటర్ల మేర మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్థేశించుకున్నాం. ఇప్పటి వరకు 65కిలో మీటర్ల పరిధిలో 26వేల మొక్కలు నాటేందుకు అనుమతి కూడా లభించింది. ఇందులో సుమారు 52 కిలోమీటర్ల వరకు మొక్కలు నాటడం జరిగింది. ఇవి కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు అవకాశాన్ని బట్టి మొక్కలు నాటుతున్నాం. మెట్ట ప్రాంతాల్లో రైతులు వ్యక్తిగతంగానూ మొక్కలు నాటుతున్నారు. వారికి మొక్క ఖరీదుతోపాటు సంరక్షణకు కూడా నీటి యాజమాన్య సంస్థ తరపున ప్రభుత్వం కొంత సొమ్ము చెల్లిస్తుంది.
జలకళ పథకం కింద జిల్లాలో ఎన్ని భోర్లు మంజూరయ్యాయి? ఎన్ని ఏర్పాటు చేశారు?
జలకళ పథకం ఏర్పాటు సమయంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 500 వ్యవసాయ బోర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈలెక్కన మొత్తంగా 3,500 బోర్లు ఏర్పాటు చేయాల్సివుండగా 7,149 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జియాలజిస్ట్‌ సర్వే అనంతరం 705బోర్లు మంజూరు చేశాము. వీటిలో ఇప్పటి వరకు 370 వరకు బోర్ల తవ్వకాలు జరిగాయి. వాటికి సంబంధించి రూ.5కోట్ల 50లక్షల 91వేలు సంబంధిత రిగ్గింక్‌ కాంట్రాక్టర్‌కు చెల్లించాం.