Sep 12,2023 20:56

మాట్లాడుతున్న ఎఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

మాట్లాడుతున్న ఎఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
15,16 తేదిలల్లో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నిర్మాణ మహాసభలు
ప్రజాశక్తి-నెల్లూరు :అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నిర్మాణ మహాసభలను ఈ నెల15,16 తేదీలలో నగరంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. మంగళవారం ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు.
ముఖ్యంగా దేశంలో నూతన జాతీయ విద్యావిధానం రద్దు కోసం, పాఠశాలల హేతిబద్దీకరణకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశామన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు శాపంగా మారిన జీఓ 77ను రద్దు చేయాలని,ఈ జీఓ వలన పీజీ చదివే విద్యార్థులు ప్రైవేట్‌ కళాశాలల్లో చదివితే ఫీజులను ప్రభుత్వం అందజేయదన్నారు. కేవలం యూనివర్సిటీ లో చదివే విద్యార్థులకు మాత్రమే ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తుందని దీని వల్ల విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారన్నారు. జూనియర్‌ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నం భోజనం దూరం చేసి విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన నిధులను పూర్తిగా చెల్లించకుండా రకరకాల కొర్రీలు పెట్టి విద్యార్థులకు అరకొరగా చెల్లింపులు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉచితంగా అందించాల్సిన వైద్య విద్యను పూర్తిగా ప్రైవేట్‌ పరం చేసి రిజర్వేషన్లకు తూట్లు పొడుస్తున్నారని దాని వలన పేద విద్యార్థులు వైద్య విధ్యనభ్యసించే వారు తీవ్రంగా నష్టపోతారన్నారు. వంద శాతం ఉచితంగా వైద్య విద్యలో సీట్లను ఇవ్వాలని,కావున వెంటనే 107,108 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలన్నింటిని చర్చించేందుకు ఈ మహాసభలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ప్రొఫెసర్లు,మేధావులు, విద్యావేత్తలు హాజరౌతున్న ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పవన్‌ కిషోర్‌,నగర అధ్యక్షులు శివంవర్మ, ఆకాష్‌,మౌళి, ప్రతాప్‌,సాయి, ప్రేమ్‌ తదితరులు పాల్గొన్నారు.