ప్రజాశక్తి- కలెక్టరేట్ : 2017 జనవరి 1 నుంచి 15 శాతం ఫిట్ మెంట్‌తో పెన్షన్ రివిజన్ జరగాలని ఆలిండియా బిఎస్‌ఎన్‌ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు డిమాండ్ చేశారు. జాతీయ కమిటీ పిలుపుమేరకు డాబాగార్డెన్స్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యాన బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ మెడికల్ బిల్లులు చెల్లించాలని, అలాగే సమయానికి మెడికల్ బిల్లుల చెల్లింపు ఉండాలని కోరారు.పెండింగ్ ఉన్న ఐడిఎ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. మహారాష్ట్ర సర్కిల్‌లో ఉన్న ఐడిఎ బకాయిలు వెంటనే చెల్లించాలని, పెన్షనర్లకు పార్లమెంట్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ డిమాండ్లను ఆమోదించకపోతే ఆగస్టు 24న చలో ఢిల్లీ చేపట్టి సంచార భవనం ముట్టడించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.లచ్చిరాజు, అధ్యక్షుడు ఆర్.గోవిందరాజు, కోశాధికారి ఆర్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పిఈసిహెచ్‌వి సాగర్ పాల్గొని మద్దతు తెలిపారు.










