ప్రజాశక్తి - క్రోసూరు : మాయమైన తమ బంగారాన్ని తిరిగిస్తామంటూ అధికారులు హామీనిచ్చి 50 రోజులవుతున్నా ఇప్పటికీ ఇవ్వలేదని ఖాతాదారులు ఆందోళన వెలిబుచ్చారు. 15 రోజుల్లోగా న్యాయం చేయకుంటే బ్యాంకును ముట్టడిస్తామన్నారు. మండలంలోని దొడ్లేరులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు, ఖాతాదార్లు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను అప్రైజర్ రెండునెలల కిందట కాజేసిన విషయం తెలిసిందే. దీనిపై బాధితుల ఆందోళన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. 450 మంది ఖాతాదార్ల బంగారం మాయమైనట్లు నిర్థారించి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. హామీనిచ్చి 40 రోజులు దాటుతుండడం, రుణాల రెన్యువల్ తదితర అంశాలపై బాధిత ఖాతాదార్లతో గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమను రుణాలు రెన్యువల్ చేసుకోవాలని మెసేజ్ వచ్చిందని, బ్యాంకుకు వెళ్తే ఉన్న బంగారానికే రెన్యువల్ చేస్తామంటున్నారని, చేయించుకోకుంటే అధిక వడ్డీ పడుతుందని చెబుతున్నారని అన్నారు. కనిపించకుండా పోయిన బంగారం గురించి తర్వాత చూద్దామంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు జి.రవిబాబు మాట్లాడుతూ రీజినల్ మేనేజర్ స్థాయి అధికారులు వచ్చి హామీ ఇచ్చి 50 రోజులు కావస్తున్న సమస్య పరిష్కారం కాకపోవటం ఏమిటని ప్రశ్నించారు. రికవరీ అయిన బంగారాన్ని ఖాతాదారులకు అప్పగించాలని, ఆ తర్వాతే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రెన్యువల్ తేదీని పొడిగించాలన్నారు. బ్రాంచ్ మేనేజర్ శివశంకర్ నాయక్ మాట్లాడుతూ అప్రైజర్ నాగార్జున మోసం తాలూకు సుమారు రెండున్నర కిలోల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారని తెలిపారు. అయితే ఇంకొంతమంది ఖాతలను పరిశీలించాల్సి ఉందన్నారు. దీంతో ఖాతాదార్లు మాట్లాడుతూ ఇంకెన్ని రోజులు పరిశీలిస్తారని ఆగ్రహానికి గురయ్యారు. 15 రోజుల్లో బంగారాన్ని అప్పగించకుంటే బ్యాంకును ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఎ.ఆంజనేయులు, టి.హనుమంతరావు, ఏపూరి వెంకటేశ్వర్లు, డి.నటరాజ్, సాంబిరెడ్డి, ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, టి.సామేలు, జి.హుస్సేన్‌బి, ఎం.గోవిందమ్మ, జి.జాన్, సునీత, ఝాన్సీ పాల్గొన్నారు.










