
15 నుండి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
- దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజు
ప్రజాశక్తి - శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి దసరా మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి పెద్దిరాజు తెలిపారు. విజయదశమిని పురస్కరించుకొని జరగనున్న దసరా మహోత్సవాల్లో ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ ఉత్సవాలలో స్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన కైంకర్యాలు, వాహన సేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలు, దర్శనం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో దసరా మహౌత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. భక్తులు ఉత్సవాలను వీక్షించేందుకు గంగాధర మండపం వద్ద ఎల్‌ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉత్సవాలలో స్వామి అమ్మ వార్లకు ప్రత్యేక పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాలలో ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజు నిర్వహించే గ్రామోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్కభజన, నందికోలు సేవ, తప్పేట చిందు మొదలైన జానపద కళారూపాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్సవాలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండదని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని తెలిపారు. క్షేత్ర పరిధిలో ఉన్న మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలన్నారు.ఉత్సవాలలో సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లో, క్యూ కాంప్లెక్స్‌లో తగిన ఏర్పాట్లు చేయాలని, మంచి నీరు, అల్పాహారం, బిస్కెట్లు అందజేయాలని తెలిపారు. ఉత్సవాలలో ఉత్సవ విశేషాలు తెలియజేసే విధంగా తగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా ఉత్సవ విశేషాలు గురించి ప్రచారం చేయాలని సూచించారు.