
ప్రజాశక్తి-నక్కపల్లి:ఈనెల 15 నుండి అన్ని పంచాయతీ కార్యాలయాల్లో తప్పనిసరిగా డిజిటల్ చెల్లింపులు చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈవోపీఆర్డి వెంకటనారాయణ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. పంచాయితీల్లో డిజిటల్ చెల్లింపులపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించారు. అభివృద్ధి పనులకు, ఆదాయ సేకరణ తదితర లావాదేవీలన్నీ తప్పని సరిగా డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరగాలని సూచించారు. ఈనెల 9వ తేదీ నుండి నిర్వహించనున్న నా భూమి - నా దేశం కార్యక్రమానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సచివాలయంలో అందిస్తున్న సేవలు పై ఆరా తీశారు. ప్రజలకు సకాలంలో సేవలు అందించాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.