Aug 01,2023 23:04

శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు

- ఆప్కాస్‌ కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలి
- 7న కలెక్టరేట్‌ ముట్టడి
- సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు
- మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించిన కార్మికులు
- 132 మంది కార్మికుల అరెస్టు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌, ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం: 
మున్సిపల్‌ ఆప్కాస్‌ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం డిమాండ్‌ చేశారు. హామీల అమలు కోసం దశలవారీ ఆందోళనలో భాగంగా ఈనెల 7వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. అప్పటికీ స్పందన లేకుంటే ఈనెల 15 నుంచి నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఫెడరేషన్‌ ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపల్‌ కార్యాలయాలను మున్సిపల్‌ కార్మికులు ముట్టడించారు. 132 మంది కార్మికులను అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు పెద్దఎత్తున చేరుకున్న పారిశుధ్య, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు కార్యాలయం వద్ద బైఠాయించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అరెస్టులకు ప్రయత్నించగా, కార్మికులు ప్రతిఘటించారు. తేజేశ్వరరావు, బలరాంతో పాటు ఫెడరేషన్‌ నగర అధ్యక్షులు ఎ.గణేష్‌తో పాటు 87 మందిని బలవంతంగా అరెస్టు చేసి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టుకు ముందు కార్మికులనుద్దేశించి తేజేశ్వరరావు, బలరాం మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో, పాదయాత్రలో మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఆరు నెలల్లో పర్మినెంట్‌ చేస్తామని చెప్పి నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం చేసి రెండు వేల మంది స్వీపర్లను తొలగించి, వారికి ఉపాధి లేకుండా చేశారన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్‌ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 వేతనం ప్రతినెలా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు రిస్కు, హెల్త్‌ అలవెన్స్‌, పంచాయతీ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు కళ్యాణరాజు, ఎ.రాము, డి.చిట్టిబాబు, ఆకుల.మోహన్‌, ఎ.జనార్థన్‌, గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో 15 మంది అరెస్టు
ఆమదాలవలస మున్సిపల్‌ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ పట్టణాధ్యక్షులు సంతోష్‌ కుమార్‌తో పాటు 15 మందిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఫెడరేషన్‌ నాయకులు జె.వాసు, ఎన్‌.రాజేష్‌, జె.శ్రీనివాస్‌, కె.ఈశ్వరరావు, కె.ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పలాసలో 30 మంది అరెస్టు
పలాస - కాశీబుగ్గ మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు, ఉద్యోగులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, ఫెడరేషన్‌ నాయకులు సిహెచ్‌.మురుగన్‌, ఎం.రవి, ఎస్‌.రమేష్‌, త్రివేణి, జానకితో పాటు 30 మందిని అరెస్టు చేసి కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.
ఇచ్ఛాపురంలో...
మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన కార్మికులు ఇచ్ఛాపురం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోకి ఉద్యోగులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యోగులను లోపలకు పంపించారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు ఎ.రమేష్‌ కుమార్‌ పట్నాయక్‌, కార్మికులు పాల్గొన్నారు.