Sep 13,2023 22:48

ప్రజాశక్తి-కాకినాడ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమాన్ని అమలు చేయనుందని, ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతుందని కలెక్టర్‌ కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ జె.నరసింహ నాయక్‌, ఆర్‌ఎంసి ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మాధవి, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌, ఐసిడిఎస్‌, విద్య తదితర శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ కృతికా శుక్లా అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రూపాయి ఖర్చు లేకుండానే వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ఎఎన్‌ఎం, సిహెచ్‌ఒ, ఆశా, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారని వారికి అవసరమైన ఆరోగ్య సేవలను గుర్తిస్తారని తెలిపారు. బిపి, సుగర్‌ తదితర ఏడు రకాల పరీక్షలు ఇంటివద్దే చేసేందుకు అవసరమైన కిట్లు వారివద్ద ఉంటాయన్నారు. వివరాలను ప్రత్యేక యాప్‌లో పొందుపరిచి, కేస్‌ షీట్‌లను జనరేట్‌ చేస్తారన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి గ్రామాలు, పట్టణాల్లో హెల్త్‌ క్లినిక్‌, సచివాలయం యూనిట్‌గా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఏర్పాటవుతాయని ఈ శిబిరాల్లో ప్రజలకు స్పెషలిస్టు డాక్టర్ల కన్సల్టింగ్‌, పరీక్షల నిర్వహణ, మందులు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం గురించి కూడా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు తదితరులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. రక్త హీనత ఉన్నవారిని గుర్తించి వారికి అవసరమైన మందులు, పోషకాహారం అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం తరహాలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలకు అవసరమైన వైద్య సేవలను గుర్తించి, అందించేందుకు ఉద్దేశించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలుచేసేందుకు అధికారులు కృషి చేయాలని 45 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కూడా కీలక భాగస్వామ్యం అందించనున్నట్లు కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు.