Sep 13,2023 22:36

విడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌, తదితర అధికారులు

ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష ఈనెల 15 నుంచి చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు ఆదేశించారు. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి.కృష్ణబాబులతో కలసి తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. వాలంటీర్లు, గహ సారథులు, ప్రజాప్రతినిధులు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహిస్తారన్నారు. 30న రాష్ట్రవ్యాప్తంగా, మెడికల్‌ క్యాంపులు నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్న సమావేశంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమస్యలు తీర్చడానికి మరొక వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని కలెక్టర్‌ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా జరగనున్న వివిధ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పథకంపై కూడా విస్తతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా రూపొందించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఎఎన్‌ఎంలు ఆరోగ్య పరిస్థితుల జాబితాను సమర్పించాల్సి ఉందన్నారు. మెడికల్‌ క్యాంపులలో వారికి మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితోపాటు ఎంపీడీవోలు, తాసిల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐసిడిఎస్‌ విద్య, పంచాయతీ, వార్డు సచివాలయాలు తదితర శాఖలన్నీ సమన్వయంతో సహకరించి జగనన్న ఆరోగ్య సురక్షను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గతంలో నిర్వహించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయాల నోడల్‌ అధికారి శివారెడ్డి, డిసిహెచ్‌ఎన్‌ తిప్పేంద్ర నాయక్‌, డీఈవో మీనాక్షి, ఐసిడిఎస్‌ పీడీ లక్ష్మి కుమారి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, డిఐఒ డాక్టర్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.