15 ఏళ్లలో ఎంఎల్‌ఎ ఏం చేశారో చెప్పాలి
- పిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్
ప్రజాశక్తి-కావలి : 15 ఏళ్ల రాజకీయంలో సొంత నిధులతో స్థానిక ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని పిఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ సవాల్ విసిరారు. ఆదివారం స్థానిక పి.ఎస్..ఆర్. ట్రస్ట్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''పల్లెపల్లెకు పసుపులేటి'' కార్యక్రమంలో భాగంగా మండలంలోని రుద్రకోటకి వెళ్లినప్పుడు స్థానికులు అనేక సమస్యలు తెలిపారన్నారు. ముఖ్యంగా గ్రావెల్ అక్రమ తవ్వకాలపై వారు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేశామని, ప్రజలకి ఈ విషయాలు తెలియాలని కావలి పట్టణంలో పోస్టర్లు అంటించామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మున్సిపాలిటీ అధి కారులు అక్రమ కేసులు పెట్టారని, తనతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారన్నారు. ఎంఎల్‌ఎ అక్రమాలు చూస్తూ ఊరుకోబోమన్నారు. ''ప్యాకేజీ స్టార్'' అని ఎంఎల్‌ఎ తనను అవహేళన చేశారన్నారు. తాను పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయలేదని తెలిపారు. తాను 2019 ఎన్నికల నుంచి ప్రతి పల్లెలో చేసిన సేవలు ఏంటో ప్రజలే చెబుతానని తెలిపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు పెడితే భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. ఆయనలాగా అక్రమ గ్రావెల్, ఇసుక మాఫియా నిర్వహించలేదని విమర్శించారు. ఎంఎల్‌ఎ అండతో అధికారులు ఇలా అక్రమాలు చేయడం మానుకోవాలన్నారు. తాము ప్రయివేట్ కేసు వేసి కోర్టు చుట్టూ తిరిగేలా చేయగలమన్నారు. తనకు సంస్కారం ఉంది కాబట్టి వదిలేస్తున్నామన్నారు. 4 నెలల్లో తాను ఎంఎల్‌ఎ అవుతానని, అప్పుడు కూడా అధికారులు ఇక్కడ పని చేయాల్సి ఉందని గుర్తు చేశారు. కమిషనర్ కింద కూర్చుని పోస్టర్లు చించుతున్నారని, ఎంఎల్‌ఎ కోసం కాకుండా ప్రజల కోసం పని చేయాలని ఆయనకు హితవు పలికారు. అధికారపార్టీ చేసే తప్పులను, దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలీస్ బందోబస్తు లేకుండా గ్రామాల్లోకి ఎంఎల్‌ఎ వెళ్తే ప్రజలు ఊరుకోరన్నారు. వంద కేసులు కాదు, వెయ్యి కేసులు పెట్టినా ఇక్కడ ఎవరూ భయపడరన్నారు. తాను ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటానని తెలిపారు. తమపై పెట్టిన అక్రమ కేసులపై కోర్టు పోలీసులకు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు.










