
ప్రజాశక్తి-అచ్యుతాపురం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రుషిల్ డెకార్ ప్లైవుడ్ కంపెనీ ముఠా కార్మికులు కంపెనీ ఎదుట నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో 14వ రోజుకు చేరింది. మంగళవారం మండుటెండలో తమ ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 ఒప్పందం ప్రకారం తమకు కూలి రేట్లు చెల్లించాలని, తమకు పనులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం తమకు పనుల్లేకపోవడంతో కుటుంబాలు గడవక గత్యంతరం లేని పరిస్థితిలో మందు టెండలను సైతం లెక్కచేయకుండా పరిశ్రమ ఆవరణలో ఆందోళన కొనసాగిస్తున్నామని చెప్పారు. సుమారు 100 మంది కార్మికులు తమ ఇల్లు వదిలి ఎండలో చేస్తున్న దీక్షలకు అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఎస్‌ఇజెడ్ నిర్వాసితులందరూ ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయడానికి తమతో కలిసి వచ్చిన రాజకీయ పార్టీలకే రానున్న ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపిస్తామని స్పష్టం చేశారు.