
ప్రజాశక్తి-అనకాపల్లి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం, సిపిఐ సంయుక్తంగా ఈ నెల 14నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రచార భేరిని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో బుధవారం జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ముందుగా ఇటీవల మరణించిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు సునీత చోప్రా, సిపిఎం గాజువాక సీనియర్ నాయకులు జి సుబ్బారావు చిత్రపటాలకు పార్టీ సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ, గండి నాయన బాబు, కర్రి అప్పారావు, డి.సత్తిబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కష్టజీవుల కోసం నిర్బంధాలను అధిగమించి ఎన్నో పోరాటాలు చేశారని కొనియాడారు. నేడు కార్మికులు కష్టజీవులను పణంగా పెట్టి మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. ఈ విధానాలను తిప్పి కొట్టడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను, ధరల పెరుగుదలను వివరించి ప్రజా పోరాటాలకు సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, జి కోటేశ్వరరావు, ఎం అప్పలరాజు, జిల్లా కమిటీ సభ్యులు గనిశెట్టి సత్యనారాయణ, ఆర్ రాము, వివి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.