
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నగరంలో గత 40 రోజులకు పైగా 144, 30 సెక్షన్లు అమలులో ఉన్నాయని ఊదరగొడు తున్న పోలీసులకు వైసిపి నాయకులు చేస్తున్న చట్ట ఉల్లంఘన పనులు కనిపించడం లేదా? టిడిపి నాయకులు ప్రశ్నించారు. స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో మంగళవారం సాయంత్రం వైసిపి నాయకులు చంద్రాసుర దహనం పేరిట చేపట్టిన కార్యక్రమంలో మాజీ సిఎం చంద్రబాబు బొమ్మను దహనం చేయడాన్ని టిడిపి నాయకులు తప్పుబట్టారు. ఎంపి మార్గాని భరత్ రామ్ సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగిందని, కావున ఆయనతో పాటు వైసిపి రాజమహేంద్రవరం అర్బన్ కో ఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసిపి నాయకులు అజ్జరపు వాసు, ఎన్‌వి శ్రీనివాస్, బర్రే కొండబాబు, మార్తి లక్ష్మి, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, పీతా రామకష్ణలతోపాటు వారి వెంట ఉన్న సుమారు 50 మందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ త్రీ టౌన్ పోలీసులకు మాజీ ఎంఎల్‌సి ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆదిరెడ్డి శ్రీనివాస్, యర్రా వేణు గోపాల రాయుడు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి నేతలకు ఒక న్యాయం వైసిపికి మరో న్యాయం జరుగుతుందన్నారు. తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కి నిరసన చేస్తే అరెస్టు చేస్తున్నారని, వైసిపి వారు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. భవాని మాల వేసుకుని చంద్రబాబు ఫ్లెక్సీని ఎంపి భరత్ రామ్ తగులబెట్టడాన్ని చూస్తుంటే హిందువులన్నా, హిందువుల విధానాలన్నా ఎంతటి చులకన భావం ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. చంద్రబాబు బొమ్మను దహనం చేసిన వారిపై కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు వర్రే శ్రీనివాసరావు, రాచపల్లి ప్రసాద్, రెడ్డి మణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.