Oct 19,2023 20:32

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సిఎం కార్యక్రమాన్ని తిలకిస్తున్న జిల్లా కలెక్టర్‌ తదితరులు

14,304 మందికి 'జగనన్న చేదోడు'
- లబ్ధిదారుల ఖాతాలలో రూ. 14.30 కోట్లు జమ
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

    జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలో 14,304 మంది అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో రూ. 14 కోట్ల 30 లక్షల 40 వేలు రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి జమ చేశారని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ కేంద్రం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జగనన్న చేదోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ.325.02 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌ ద్వారా నంద్యాలలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, బెస్త సంక్షేమ సంఘం డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, రజక సంఘ డైరెక్టర్‌ వెంకటలక్ష్మి తదితరులు వీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద నాల్గవ విడతలో ఒక్కక్కరికి 10 వేల రూపాయల చొప్పున 14,304 మంది అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 2820 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్ల 82 లక్షలు, బనగానపల్లెలో 3163 మందికి రూ. 3 కోట్ల 16 లక్షల 30 వేలు, డోన్‌లో 1687 మందికి రూ.1 కోటీ 68 లక్షల 70 వేలు, నందికొట్కూరులో 1417 మందికి రూ.1 కోటీ 41 లక్షల 70 వేలు, నంద్యాలలో 2999 మందికి రూ. 2 కోట్ల 99 లక్షల 90 వేలు, శ్రీశైలంలో 1519 మందికి రూ. 1 కోటీ 51 లక్షల 90 వేలు, పాణ్యంలో 699 మందికి రూ. 69 లక్షల 90 వేలు జమ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లాలో జగనన్న చేదోడు పథకం కింద మెగా చెక్కును జిల్లా కలెక్టర్‌, బెస్త సంక్షేమ సంఘ డైరెక్టర్‌, రజక సంఘ డైరెక్టర్‌ లబ్ధిదారులకు అందజేశారు.