Sep 26,2022 23:30

డంపింగ్‌ యార్డును పరిశీలిస్తున్న కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి - ఆరిలోవ : జివిఎంసి 13వ వార్డులో కమిషనర్‌ రాజబాబు సోమవారం తెల్లవారు జామున వార్డు కార్పొరేటర్‌ కెల్ల సునీతతో కలిసి పర్యటించారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ దగ్గరలోని డంపింగ్‌ యార్డును, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వద్ద ఖాళీగా ఉన్న తాత్కాలిక గృహాలను, కాలనీ చివరి బస్టాపు వద్ద నిర్మించిన జివిఎంసి మార్కెట్‌ యార్డును, ప్రధాన గెడ్డలను పరిశీలించారు. మార్కెట్‌ యార్డు నిర్మించి నాలుగేళ్లు అయినా ఖాళీగా ఎందుకు ఉంచేసారని అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఆయన ఆరిలోవ కాలనీ గుండా ప్రవహించే ప్రధాన కాలువలను పరిశీలించారు. గెడ్డల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయించాలని, రహదారులను శుభ్రం చేయాలని, చెత్త తరలించే క్లాప్‌ వాహనాలు నిర్ణీత సమయానికి పిన్‌ పాయింట్‌ వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. ఎంఎస్‌ఎఫ్‌ -2లో ఉన్న వ్యర్థాలను నిల్వ లేకుండా ఏ రోజుకారోజు కాపులుప్పాడ డంపింగ్‌ యార్డుకు తరలించాలని ఆదేశించారు. దుర్గాబజార్‌ను శివాజీనగర్‌లో నిర్మించిన మార్కెట్‌ యార్డుకు తరలించాలని, నిర్వాసితులకు ఏర్పాటుచేసిన ఖాళీ షెడ్లను తొలగించాలని ఆదేశించారు. దారపాలెంలో అనధికార కట్టడాలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా వచ్చిన రాజాబాబును వార్డు కార్పొరేటర్‌ దంపతులు కెల్ల సునీత సత్యనారాయణ సత్కరించారు. ఈ పర్యటనలో ఎడిసి విశ్వనాధం, సన్యాసిరావు, సిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, డిఇ వంశీ, ఇఇ మత్స్య రాజు పాల్గొన్నారు.