గోల్డెన్ జూబ్లీకి ఏర్పాట్లు చేస్తున్న కళాశాల సిపిడిసి
ప్రజాశక్తి - ఉంగుటూరు
నారాయణపురంలో శ్రీఅరవింద శత జయంతి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (ఎస్‌ఎఎస్) గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలతో పాటు, పూర్వవిద్యార్థుల సమ్మేళనం, శ్రీఅరవిందుని 150వ జయంతి కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షులు ఈపూరి సత్యనారాయణ అధ్యక్షతన గురువారం కాలేజీలో సమాయత్త ఏర్పాట్లపై సమీక్షించారు. పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో కాలేజీ ప్రాంగణంలో అరవిందు, పొట్టి శ్రీరాములు, మహాత్మ గాంధీ విగ్రహాలకు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు సోదరులు వితరణ చేశారు. పైలాన్ నిర్మాణానికి పూర్వ విద్యార్థి, సిఐ ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఆర్‌ఒ తాగునీటి పథకానికి వేగేశ్న రంగరాజు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇంకా చాలా మంది పూర్వవిద్యార్థులు కళా శాలలో మౌలిక సదుపాయాలు, అభి వృద్ధికి సాయం అందించానికి ముందుకురావడం అభినందనీయమని ప్రిన్సిపల్ టికె.విశ్వేశ్వరరావు అన్నారు. 12వ తేదీన పైలాన్, అరవిందు, గాంధీ విగ్రహాలను ఆవిష్కరణ అనంతరం సమావేశం నిర్వహించనున్నారు. 13న ఈ కాలేజీలో వివిధ రంగాల్లో స్థిరపడిన, పూర్వవిద్యార్థులతో అపూర్వ సమ్మేళనానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఈపూరి సత్యనారాయణ వెల్లడించారు. గోల్డెన్ జూబ్లీకి సంబంధించి బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి అప్పారావు, శ్రీరామకృష్ణ, విజయకుమార్, గుణ్ణం బుల్లెబ్బాయి, కూన అప్పారావు పాల్గొన్నారు.










