Nov 11,2022 23:01

 సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌
ప్రజాశక్తి కంచికచర్ల 

ఈ నెల 13 న విజయవాడ సమీపంలోని నున్న గ్రామంలో జరగనున్న ఏపి గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఎన్టీఆర్‌ జిల్లా 8 వ మహాసభ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య కార్మికుల సమావేశం యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు బెజ్జం భూషణం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో పని చేస్తున్నారన్నారు. జవో నెంబర్‌ 551,132 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు, నీ యస్‌, ఈ యస్‌ ఐ, అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, పాలకులు మాత్రం అమలు చేయకపోవటం వల్ల కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. టెండర్‌ విధానంతో పని లేకుండా, ఉద్యోగులుగా కొనసాగిం చాలని హైకోర్టు తీర్పును సైతం పాలకులు అటకెక్కించి, కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించు కుంటున్నారన్నారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాలు అమలు చేయటంతో పాటు, ఉద్యోగులుగా గుర్తించాలని, నీ యఫ్‌, ఈ యస్‌ ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం, భవిష్యత్తు కార్యాచరణకు ఈ మహాసభలో చర్చిస్తామన్నారు. జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న పారిశుద్ధ్య, ఎలక్ట్రికల్‌, నీటి సరఫరా సిబ్బంది, స్వచ్చ భారత్‌ సిబ్బంది పాల్గొన్న జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి చోడవరపు సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.