Oct 12,2023 21:17

13న జగనన్న పాలవెల్లువ రెండవ విడత సర్వే...
పాలసేకరణ ప్రారంభించనున్న అమూల్‌ సంస్థ: కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు:
రెండవ విడత జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీన 11 మండలాలలో గల 107 ఆర్‌బికేల పరిధిలో సర్వే నిర్వహించనున్నారని కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ తెలిపారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జగనన్న పాల వెల్లువలో భాగంగా రెండవ విడత పాలసేకరణ ప్రారంభంపై జిల్లా కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులుతో కలసి సమీక్ష నిర్వహించారు. ఈసమీక్షలో పశు సంవర్థక శాఖ డిడి ప్రభాకర్‌, జిల్లా డెయిరీ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ రవిచంద్రన్‌, డిసిఓ బ్రహ్మానంద రెడ్డి, అమూల్‌ ప్రతినిధి నవీన్‌, ఎంపిడిఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షన్మోహన్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమ మొదటి విడతలో పైలట్‌ ప్రాజెక్టు కింద వి.కోట, శాంతిపురం, రామకుప్పం మండలాలలోని 101 గ్రామాలలో ప్రారంభం కావడం జరిగిందని, రెండవ విడత పాలసేకరణకు తవణంపల్లి, ఐరాల, బంగారుపాలెం, బైరెడ్డిపల్లి, పలమనేరు, పూతలపట్టు, కార్వేటినగరం, నగరి, నిండ్ర మండలాలలో ఈనెల 13 నుండి సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సర్వే అనంతరం నవంబర్‌ 4వ వారం నుండి పాలసేకరణ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పాలఉత్పత్తి పుష్కలంగా ఉన్న గ్రామాలలో మెంటర్లు, రూట్‌ ఇంచార్జ్‌ లు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ల ద్వారా ఏఎంసియులను గుర్తించి, భవనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపిడిఓలకు సూచించారు. ఏఎంసియులలో అవసరమైన సాఫ్ట్‌వేర్‌లను సిద్ధం చేసుకుని పాడిరైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయిలో సిబ్బందితో సెక్రెటరీ, అసిస్టెంట్‌ సెక్రెటరీలకు శిక్షణ ఇచ్చి ఏఎంసియుల పనితీరుని పర్యవేక్షించాలని డ్వామా పిడి గంగా భవానీని ఆదేశించారు.