13న ఎమ్మెల్సీ పోలింగ్‌కు సర్వం సిద్ధం
జిల్లాలో 91 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- ఓటర్లు పట్టభద్రులు 54,929 మంది, ఉపాధ్యాయులు 4,426 మంది
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లాలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశామన్నారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిర్వహణపై ఎస్‌పి కె.రఘువీర్ రెడ్డితో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలన్నారు. ఓటర్ ఐడి కార్డులు వంద శాతం పంపిణీ చేశామని తెలిపారు. ఓటర్ ఓటు వేసేందుకు ఎన్నికల కమిషన్ సూచించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా ఓటర్ స్లిప్పుతో పాటు వెంట తెచ్చుకోవాలన్నారు. పోలింగ్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు సాగుతుందన్నారు. జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 54,929 మంది ఉన్నారని, అందులో పురుషులు 38,695 మంది, స్త్రీలు 16,230 మంది, ఇతరులు 4 ఉన్నారని చెప్పారు. ఉపాధ్యాయ ఓటర్లు 4,426 మంది కాగా పురుషులు 2,806 మంది, స్త్రీలు 1,619 మంది, ఇతరులు 1 ఉన్నారని తెలిపారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 91 కాగా పట్టభద్రులు 61, ఉపాధ్యాయులు 30 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల సంబంధించి 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 9 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. 39 లొకేషన్లలో 500 పోలింగ్ సిబ్బందిని కేటాయించామన్నారు. పోలింగ్ ఆఫీసర్స్ 118 మంది, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ 118 మంది, ఇతర పోలింగ్ ఆఫీసర్స్ 237 మంది, మైక్రో అబ్జర్వర్స్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 118 మందిని నియమించామన్నారు. 15 రూట్స్, 34 బస్సుల ఏర్పాటు, 15 మంది సెక్టారల్ ఆఫీసర్స్, 7 బృందాలుగా ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మోడల్ కండక్ట్ కోడ్ అమలుకు 29 బృందాలను నియమించినట్లు చెప్పారు. జిల్లా ఎస్‌పి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట భద్రత, బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ బూత్‌ల వద్దకు ఓటర్లు మొబైల్ ఫోన్స్, ఐ పాడ్, టాబ్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. పోలింగ్ నిర్వహించే అధికారులతో సహా ఎవరూ కేంద్రాలలోకి నీరు, ఇతర ద్రవ పదార్ధాలను తీసుకువెళ్లరాదని చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్ శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎవరైనా ఎన్నికల నియమాలను ఉల్లంఘించినా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినా ఎలక్షన్ కమిషన్ వారికి, స్ధానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందింస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ బి.పుల్లయ్య, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










