Oct 09,2022 23:37

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు నేత వెంకట్‌

ప్రజాశక్తి-చింతూరు :కార్మిక హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి నిత్యం అలుపెరగని పోరాటం చేస్తూ, కార్మికుల సంక్షేమానికి పాటుబడుతున్న సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధమ మహాసభలు ఈ నెల 13న చింతూరులో జరుగుతున్నాయని ఆ యూనియన్‌ జిల్లా నాయకుడు పల్లపు వెంకట్‌ అన్నారు. మహాసభల జయప్రదానికి కార్మికులంతా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం చింతూరులో జరిగిన సిఐటియు సమావేశంలో వెంకట్‌ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుని, వారికి కనీస వేతనాలు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏళ్లతరబడి పోరాడి సాధించుకున్న 40 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్‌కోడ్స్‌ను బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చి, కార్మికులను కట్టుబానిసలను చేయాలని చూస్తోందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి, లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచిపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ పాలనను కేంద్రీకతం చేసే విధానాలను తీసుకొస్తోందన్నారు.క ార్మికుల సంక్షేమ పథకాలు అమలులో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం దూర్మార్గమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు, ప్రజలను, ఉద్యోగులను కలుపుకుని విశాల కార్మిక ఉద్యమాన్ని నిర్మించేందుకు దిక్చూచిగా ఈ నెల 13న జరిగే రంపచోడవరం జిల్లా ప్రధమ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి లక్ష్మణ్‌, నాయకులు సుబ్బారావు, స్వరూప, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.