ప్రజాశక్తి-పాడేరు టౌన్: జిల్లాలో 12,939 మంది విద్యార్థులకు రూ.5 కోట్ల 13 లక్షల విద్యా దీవెన నిధులు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మదనపల్లి నుండి జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి తల్లుల ఖాతాలకు బుధవారం జమ చేశారు. ఐటిడిఎ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లించాలని చెప్పారు. 97 శాతం మంది విద్యార్థులకు విద్యా దీవెన జమైందని, మూడు శాతం మందికి వివిధ కారణాల వలన జమ కాలేదని అన్నారు. విద్యార్థులు గ్రామ సచివాలయాలకు వెళ్లి సమస్యలను పరిష్కరించు కోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా దీవెన సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా చదువుకోవాలన్నారు.
పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో రూ.30 కోట్ల 45 లక్షల 76 వేలు ఫీజు రియంబర్స్ మెంట్ చెల్లించిందన్నారు. ముఖ్యమంత్రి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, మనబడి నాడు నేడు కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూ డిడి ఐ.కొండలరావు, డిఇఒ రమేష్, ఎటిడబ్ల్యుఒ ఎల్.రజిని, విద్యార్ధులు, తలిదండ్రులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఆంగ్ల భాష పై ప్రతేక దృష్టి సారించాలి
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
పాడేరు: పిల్లలు బాగా చదవి, ఆంగ్ల భాషపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హిత బోధ చేసారు. పాడేరు మండలం కొత్తాబు, బర్సింగి, డొకులూరు, బొడ్డు మామిడి గ్రామాలలో స్థానిక శాశన సభ్యులు కే.భాగ్యలక్ష్మితో కలిసి బుధవారం పర్యటించారు. ముందుగా గబ్బంగి పంచాయతి కొత్తాబు చేరుకున్న కలెక్టర్ అక్కడ జిల్లా కలెక్టర్ నిధులు రూ.1.50 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.1.50 లక్షలతో గ్రామస్తులు శ్రమ దానంతో పునర్నిర్మించిన పాఠశాల, అంగన్వాడి భవనాన్ని శాసన సభ్యురాలితో కలిసి ప్రారంభించారు. పాఠశాల విద్యార్ధి కలెక్టర్ చిత్రపటాన్ని డ్రాయింగ్ వేసి బహూ కరించటడంతో కలెక్టర్ మురిసిపోయి అభినందించారు. థాలసేమియాతో భాద పాడుతున్న ఆరు సంవత్సరాల చిన్నారి సీదిరి దీక్షితకు మూడు నెలల పాటు ఫించన్ వచ్చి తరువాత రాలేదని తెలుసుకున్న కలెక్టర్ క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వివరాలు అందజేస్తే పెన్సన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. బర్సింగి గ్రామంలో గ్రామస్తుల శ్రమదానంతో పునర్నిర్మించిన ప్రాధమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్, శాసన శాభ్యురాలు ప్రారంభించారు. భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ మరో విడత పెయింట్స్ ఆకట్టుకునే విధంగా వేయించాలని ఎంపిడిఓ నవీన్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆ భవనం గేటు ఏర్పాటుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం డోకులూరు చేరుకున్న కలెక్టర్ గ్రామస్తుల శ్రమదానంతో పునర్నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను సందర్శించి మొక్కలు నాటారు. కొత్తాబు, బర్సింగి, దొకులూరు వంటి పాఠశాలలు గుర్తించి వివరాలు అందజేయాలని ఎంపిడిఓ నవీన్‌ను ఆదేశిస్తూ గ్రామస్తులు సహకారంతో పునర్నిర్మాణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. బొడ్డుమామిడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద సచివాలయ నిధులు మూడు లక్షలతో నిర్మిస్తున్న రహదారి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ రాంబాబు విజ్ఞప్తి మేరకు మిషన్ కనెక్ట్ పాడేరు కింద మంజూరుకు అవకాశాలు పరిశీలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో పాడేరు ఎంపిడిఓ నవీన్, ఎంపిపి ఎస్.రత్నకుమారి, ఆయా పంచాయతీల సర్పంచులు ఎస్.రాంబాబు, బి.చిట్టిబాబు, ఎ. సన్నిబాబు, జి.నీలకంఠం, వి.రాంబాబు, ఎంపిటిసిలు డి.సన్యాసిరావు, చిట్టమ్మ, పార్వతమ్మ, కనకలమ్మ, మాజీ ఎంపిపిలు మంగందొర, రమణమూర్తి, ఎంఇఓ సరస్వతి పాల్గొన్నారు.










