Jul 24,2021 20:14

ముంబయి : మహారాష్ట్రలో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి రారుఘడ్‌, రత్నగిరి, పల్గాహర్‌, థానే, సింధుదుర్గా, కొల్హాపూర్‌, సంగ్లి, సతారా జిల్లాలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారానికి 138కు చేరినట్లు ఆ రాష్ట్ర విపత్తుల, పునరావాస శాఖ మంత్రి విజరు వాడేత్తివార్‌ ప్రకటించారు. 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కొండ చరియలు విరిగిపడి మరణించిన వారే ఉన్నారు. రారుఘడ్‌ జిల్లాలోనే 47 మంది కొండచరియలు పడి మరణించారు. తలియే గ్రామంలోనే 37 మంది మరణించగా, జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో 10 మంది మరణించారు. రత్నగిరి జిల్లాలో 11, సతారా జిల్లాలో ఆరుగురు, కొల్లాపూర్‌లో ఐదుగురు, ముంబయి సబర్బన్‌లో నలుగురు, సింధుదుర్గ్‌లో ఇద్దరు, పుణేలో ఒకరు వర్ష సంబంధిత ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. గొండియా, చంద్రాపూర్‌ జిల్లాల్లోనూ మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 54 గ్రామాలు పూర్తిగా వరద ప్రభావానికి గురికాగా, 821 గ్రామాలు పాక్షికంగా వరద ప్రభావానికి గురయ్యాయి. రాష్ట్రంలో 59 మంది ఆచూకీ లేకుండా పోయారని అధికారులు తెలిపారు. రారుఘడ్‌ జిల్లాలోనే 53 మంది, సతరాలో నలుగురు, ధానేలో ఇద్దరు గల్లంతయ్యారు.
చురుగ్గా సహాయ కార్యక్రమాలు
సహాయక కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటి వరకూ 89,333 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొల్హాపూర్‌ జిల్లాలోనే 40,882 మందిని తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల పరిధిలోని 21 బృందాలు సహాయక కార్యక్రమాల్లో పాల్గంటున్నాయని, త్వరలో ఆర్మీ, నేవీలకు చెందిన 6 బృందాలు పాల్గంటాయని అధికారులు తెలిపారు.
రూ.5 లక్షల పరిహారం
మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాయపడిన వారి ఆసుపత్రుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలో ఆరు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.