ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై జిల్లా పోలీసు అధికారులు కొరడా ఝళిపించారు. 138 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారు వారి గమ్యస్థానానికి వెళ్లడానికి మద్యం మత్తులో వాహనాలను నడపడం వలన అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురికావడం మనం రోజూ గమనిస్తూ ఉన్నామన్నారు. వారు మద్యం మత్తులో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో 27మంది, బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో 58 మంది, చీరాల సబ్ డివిజన్ పరిధిలో 53 మంది జిల్లా వ్యాప్తంగా మొత్తం 138 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారిని త్వరలో కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బహిరంగంగా మద్యం సేవించే వారి సమాచారం తెలిసిన యడల వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, లేదా ఎస్పీ బాపట్ల హెల్ప్ లైన్ నెంబర్ 8333813228కు కాల్ చేసి సమాచారం అందించాలని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.










