Jul 26,2023 19:51

మండల వ్యవసాయాధికారి రామారావు

ప్రజాశక్తి-ఈపూరు : ఇకెవైసి చేయించుకోని కారణంగా 1366 మంది రైతులు పిఎం కిసాన్‌ పథకాన్ని కోల్పోయే అవకాశం ఉందని మండల వ్యవసాయాధికారి ఆర్‌.రామారావు అన్నారు. వీరంతా ఈ నెల 30వ తేదీలోపు రైతు భరోసా కేంద్రం సిఎస్‌ఇ కేంద్రాల్లో ఇకెవైసి చేయించుకోవాలని సూచించారు. ఈ అంశంపై బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పిఎం కిసాన్‌ పథకానికి మండలంలో 8297 మంది రైతులు అర్హులని చెప్పారు. మండలంలో 2060 కౌలురైతు గుర్తింపు కార్డులు మంజూరు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 871 మందికి ఇచ్చామన్నారు. కార్డులు పొందినవారికి పంటల బీమా, రాయితీ విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు, పంట కొనుగోలు తదితర ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. రైతులు పొలం గట్లపై నాటుకునేందుకు కందులు అందుబాటులో ఉన్నాయని, మండలంలో 1095 ఎకరాల్లో కంది సాగు చేస్తుండగా దీన్ని 1750 ఎకరాలకు విస్తరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కందులు క్వింటాళ్‌కు రూ.7 వేలు మద్దతు ధరను ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలైన జనుము, జీలుగలు ఖరీఫ్‌ సాగుకు అవసరమైన యూరియా, డిఎపి, 20-20 ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు.