వాషింగ్టన్ : మెరుగైన వేతనాలు కోరుతూ డెట్రాయిట్‌లోని మూడు ఆటోమేకర్స్‌కు (వాహన తయారీ కంపెనీలు) చెందిన 13,000 మంది కార్మికులు శుక్రవారం సమ్మెకు దిగారు. నాలుగేళ్ల కాంట్రాక్టు గురువారంతో ముగియడంతో .. మూడు కంపెనీలకు చెందిన యూనియన్ సభ్యులు ఏకకాలంలో వాకౌట్ చేయడం అమెరికా 88 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి. కార్మికుల డిమాండ్‌లపై సంస్థలతో యునైటెడ్ ఆటోవర్కర్స్ యూనియన్ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మిస్సౌరిలోని వింట్జ్‌విల్లె నగరంలోని మోటర్స్ ప్లాంట్, మిచిగాన్ లోని ఫోర్డ్ ఫ్యాక్టరీ, ఒహియోలోని స్టెల్లాంటిస్ జీప్ ప్లాంట్ వద్ద పికెటింగ్ ప్రారంభించారు.
60 యూనియన్ సమాఖ్య అయిన ఎఎఫ్‌ఎల్-సిఐఒ అధ్యక్షుడు లిజ్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులు ఈ సమ్మెను పరిశీలిస్తున్నారు. నాలుగేళ్లలో 36 శాతం కన్నా వేతనాల పెంపుదల తక్కువగా ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన వ్యయం భారీగా పెరిగిపోతున్నా.. వాటికి అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని, 401కె తరహా పదవీవిరమణ పథకాలు, పదవీ విరమణ చేసినవారికి పెన్షన్ల పెంపుదల, 36 గంటల వారానికి 40 గంటల వేతనం డిమాండ్ చేస్తున్నారు.