1300 మైలురాయి
- నంద్యాలలో యువగళం
- లోకేష్‌కు జన నీరాజనం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్/రూరల్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 103వ రోజు గురువారం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. పాదయాత్ర 1300 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా నంద్యాల యాతం ఫంక్షన్ హాలు సమీపాన లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక నంద్యాల రూరల్ కానాలలో పసుపు మార్కెట్, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు యువనేత లోకేష్ హామీ ఇచ్చారు. 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నప్పటికీ యువనేత లోకేష్ మొక్కవోని పట్టుదలతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఉదయం డాక్టర్ల సూచనమేరకు నంద్యాల పద్మావతి నగర్‌లో ఉన్న మ్యాగ ఎంఆర్‌ఐ సెంటర్‌లో నారా లోకేష్ కుడి భుజానికి ఏంఆర్‌ఐ స్కానింగ్ చేయించారు. పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సందర్భంలో భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల తోపులాటలో నారా లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అప్పటి నుండి నొప్పితో బాధపడుతూనే లోకేష్ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియోథెరపీ, డాక్టర్ల సూచన మేరకు జాగ్రతలు తీసుకున్నా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటినా నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ల సూచన మేరకు ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించారు. ఇదిలా వుండగా గురువారం కానాలలో లోకేష్ పాదయత్ర సందర్భంగా రోడ్లన్నీ జనంతో కిటకిటలాడాయి. యువనేతను చూసేందుకు భారీగా జనం రోడ్లపైకి తరలివచ్చారు. ముస్లిం మైనారిటీలు యువనేతకు స్వాగతం పలికి తమ సమస్యలను విన్నవించారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న యువత, మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వేసవిలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఏడాది ఓపిక పడితే రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలు తీరుస్తుందని భరోసా ఇచ్చి లోకేష్ ముందుకు సాగారు. అంతకుముందు యాతం ఫంక్షన్ హాలువద్ద రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. దారి పొడవునా కుందూనది పరివాహక గ్రామాల ప్రజలు, జాతీయ రహదారి ఎలైన్ మెంట్ మార్పు బాధితులు, వడ్డెరలు, ముస్లింలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. మొత్తం 17.3 కిలోమీటర్ల మేర యువనేత పాదయాత్ర కొనసాగింది. ఇప్పటివరకు మొత్తం 1319.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో మాజీ మంత్రి ఫరూక్, టిడిపి నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.










