Jul 26,2023 21:07

ప్రజాశక్తి - ఆచంట
మండలంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 3,300 ఎకరాల్లో నాట్లు వేయగా, వాటిలో సుమారు 1300 ఎకరాలు నీట మునిగినట్లు మండల ఎఇఒ బి.నాగరాజు తెలిపారు. మరో 800 ఎకరాలకు సరిపడా ఆకుమడులు ముంపునకు గురైనట్లు తెలిపారు. ఆచంట, కొడమంచిలి, కోడేరు, పెనుమంచిలి, వల్లూరు, శేషమ్మచెరువు, తదితర గ్రామాల్లో నాట్లు ముంపుబారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో సార్వాసాగుకు ఆదిలోనే హంసపాదు ఎదురుకావడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. భారీ వర్షాలకు మండలంలోని నక్కల, తాడేరు, కొటాలపర్రు ప్రధాన పొంగి పొర్లుతున్నాయి.
అత్తిలి :రైతులు వరిచేల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి జెడ్‌.వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మంచిలి, కంచుమర్రు గ్రామాల్లోని నారుమడులను వ్యవసాయాధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా నిన్నటి నుంచి కురిసిన అధిక వర్షాలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల పరిస్థితిపై సంబందిత వివరాలు ఎఒ టికె.రాజేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పంట పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కంచుమర్రు విఎఎ కృష్ణ, మంచిలి విఎఎ చంద్రిక, ఈడూరు విఎఎ రాము పాల్గొన్నారు.