Jul 28,2021 08:12

న్యూఢిల్లీ : కరోనా ఒక సారి సోకితేనే తట్టుకోలేం. అలాంటిది ఓ వైద్యురాలు 13 నెలల వ్యవధిలో మూడు సార్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సదరు బాధితురాలే చెప్పారు. వివరాల్లోకి వెళితే...డాక్టర్‌ సృష్టి హళ్లారి.. ముంబయిలోని వీర్‌ సావర్కర్‌ ఆసుపత్రిలో కరోనా విధులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది జూన్‌ 17 తొలిసారి కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో త్వరగా కోలుకున్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్‌లో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కరోనా రెండు డోసులను స్వీకరించారు. ఆ తర్వాత నెల రోజులకే అంటే మే 29న ఈ వైద్యురాలు రెండోసారి వైరస్‌ బారినపడ్డారు. అప్పుడు కూడా హోం క్వారెంటైన్‌లో ఉండి కోలుకున్నారు. జులై 11న మూడోసారి సృష్టికి వైరస్‌ సోకిందని పరీక్షల్లో తేలింది. ఈసారి ఆమెతో పాటు కుటుంబం మొత్తానికి వైరస్‌ సోకిందని సఅష్టి వెల్లడించారు. కానీ ఈ సారి తీవ్రత ఎక్కువ ఉందని, కుటుంబ సభ్యులు సైతం ఆసుపత్రి పాలయ్యారని, రెమ్‌డెసివర్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అమ్మ, సోదరుడికి మధుమేహం ఉందని, నాన్న బిపి, కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. సోదరుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా..ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందినట్లు సృష్టి తెలిపారు.
టీకాలు తీసుకున్నా కరోనా సోకుంతుందని, అయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 'టీకా రెండు డోసుల తర్వాత వైరస్‌ బారినపడినవారున్నారు. అన్ని వయస్సులవారికి బ్రేక్‌ థ్రో ఇన్ఫెక్షన్‌( టీకాలు తీసుకున్న తర్వాత వైరస్‌ సోకడం)వచ్చే ఆస్కారం ఉంది. అయితే టీకాలు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు సహకరిస్తాయి' అని వాక్‌హార్డ్‌ ఆస్పత్రికి చెందిన వైద్యులు బెహ్రామ్‌ పార్దివాలా వెల్లడించారు. ఇటీవల ఐసిఎంఆర్‌ అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైన సంగతి తెలిసిందే.