ప్రజాశక్తి-అనకాపల్లి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న 14మందికి ఆర్థిక సహాయం చేసేందుకు ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయాన్ని శనివారం కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి బాధితులకు అందజేశారు. ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఆర్థిక సాయం అందుకున్న వారిలో పెదపూడి రిషబ్ బాబి, దేవరకొండ అమర్త్యరామ్, బొండపల్లి నిఖిత, మల్ల రోహిత్, పాము ప్రసాద్, చొక్కా శివ పార్వతి, చింతల ఆకాంక్ష, గన్రెడ్డి నీరజ్, నారం రాజబాబు, అండమూరి ఏసుబాబు, నిడదవోలు సుబ్బలక్ష్మి, పెట్ల పరిమళ, గుడివాడ జాస్మిత, రెడ్డి రామలక్ష్మి ఉన్నారు.
బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం చెక్కు అందజేత
కశింకోట : మెదడు ఎదుగుదల లేని బాలుడి వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంజూరైన లక్ష రూపాయల చెక్కును బాలుడి తల్లిదండ్రులకు శనివారం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అందజేశారు. మండలంలో గొబ్బూరు గ్రామానికి చెందిన మళ్ల రోహిత్‌కి పుట్టినప్పటి నుంచి మెదడు ఎదుగుదల లేదు. ఆ బాలుడికి వైద్యం అందించడానికి తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమతలేదు. తమ బిడ్డ దైయనీయస్థితిని చూస్తూ నిత్యం బాధపడే తల్లిదండ్రులు భాగ్య, యుగంధేశ్వరరావు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిసి తమ బిడ్డకు మెరుగైన వైద్యానికి సహాయం అందించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే స్పందించి నర్సీపట్నం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రోహిత్‌ను చూపించి ఆ బిడ్డ పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి కలెక్టర్‌ను పిలిచి, తక్షణ వైద్య సహాయం కింద లక్ష రూపాయలు అందించాలని ఆదేశించారు. దీంతో రోహిత్ వైద్యం కోసం కలెక్టర్ లక్ష రూపాయలు మంజూరు చేయగా, ఆ చెక్కును శనివారం మంత్రి అమర్నాథ్ రోహిత్ తల్లిదండ్రులకు అందజేశారు. దీంతో రోహిత్ తల్లిదండ్రులు మంత్రి అమర్నాథ్‌కు, కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.










