Nov 03,2023 22:25

12న తిరుమలలో దీపావళి ఆస్థానం : ఈవో

12న తిరుమలలో దీపావళి ఆస్థానం : ఈవో
ప్రజాశక్తి - తిరుమలశ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిం
చినట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈవో మాట్లాడుతూ, శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలుగకుండా వాహనసేవలతో పాటు మూల మూర్తి దర్శనం కల్పించినట్లు చెప్పారు. అదేవిధంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు 10 నుండి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి. పుష్పయాగం ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా నవంబరు 4న శనివారం 1000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తాం. టికెట్‌ ధర రూ.700గా నిర్ణయించామన్నారు. 2024వ సంవత్సరం డెయిరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉన్నాయి. 12న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం జరగనుంది. అక్టోబర్‌ నెలలో 21.75 లక్షల భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.108.65 కోట్ల కానుకలు హుండీ ద్వారా లభించాయి.
ఈ కార్యక్రమంలో జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిశోర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌విబిసి సిఈవో షణ్ముఖ్‌కుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.