* ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎం.మదన్మోహన్
ప్రజాశక్తి- శ్రీకాకుళం: ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 12వ తేదీన కలెక్టరేట్ వద్ద 12 గంటల నిరసన ప్రదర్శనను చేపడుతున్న ఫ్యాప్టో జిల్లా చైర్మన్ మజ్జి మదన్మోహన్ తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రధానోపాధ్యాయుల సంఘ కార్యాలయంలో ఫ్యాప్టో సభ్య సంఘాల సన్నాహక సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు, రీఅపోర్షన్‌మెంట్ జరిగి రెండు నెలలు కావస్తున్నా, రాష్ట్రంలో సుమారు 55 వేల మంది ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పనితీరు మార్చుకోవాలన్నారు. బదిలీలు, ప్రమోషన్లు జరిగిన ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో సెక్రెటరీ జనరల్ కొమ్ము అప్పలరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతున్నారన్నారు. విద్యార్థులు ఆంగ్ల భాషలోనే పరీక్షలు రాయాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా ఉన్న జిఒ నంబరు 117ను రద్దు చేయాలని డిమాండ్ చేవారు. సమావేశంలో ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి రమణ, ఎపిటిఎఫ్ (1938) నాయకులు టి.చలపతిరావు, డిటిఎఫ్ నాయకులు పి.కృష్ణారావు, హరిప్రసన్న, దాసరి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.










