Dec 26,2022 22:24

రెండు జిల్లాల్లో తీవ్ర ఆందోళనలో లబ్ధిదారులు
అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమాధానం కరువు
ప్రత్యేక రేషన్‌కార్డులున్నా.. పాత కార్డుల ఆధారంగా నోటీసులు
15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడి
హౌస్‌హోల్డ్‌ సర్వేలో డిలీట్‌ ఆప్షన్‌ ఇవ్వని ప్రభుత్వం
సమస్య పరిష్కారం ఎలాగని ప్రశ్నిస్తున్న బాధితులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

'ఏలూరుకు చెందిన కె.రాజేష్‌ వికలాంగుడు. గత పదేళ్లుగా పింఛన్‌ తీసుకుంటున్నారు. వివాహమైన తర్వాత వారికి ప్రత్యేక రేషన్‌కార్డు సైతం వచ్చింది. రాజేష్‌ తమ్ముడు నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేశాడని రాజేష్‌కు పింఛన్‌ నిలుపుదల చేస్తున్నట్లు నోటీసులు ఇచ్చారు. అదేమని అడిగితే మీ ఆధార్‌ నెంబర్‌ పాత రేషన్‌కార్డుకు అనుసంధానమై ఉందని, అందువల్ల పెన్షన్‌ ఆగిపోయినట్లు చెబుతున్నారు. పాత రేషన్‌ కార్డుతో లింకు తొలగించే ఆప్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసిందని, తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.'
రాజేష్‌ ఒక్కడే కాదు. రెండు జిల్లాల్లో పింఛన్‌ నిలిపివేస్తున్నట్లు నోటీసులు జారీ చేసిన 12,737 పింఛన్‌దారుల పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పింఛన్‌దారుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. అన్ని రకాల అర్హతలున్నా పింఛన్లు రద్దు చేయడం ఏమిటని అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమాధానం చెప్పేవారే లేకుండాపోయారు. ఏలూరు జిల్లాలో 2.18 లక్షల పింఛన్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 2,65,813 పింఛన్లు ఇస్తున్నారు. వీరిందరినీ ఎన్నో వడపోతల తర్వాత అర్హులుగా ఎంపిక చేశారు. ఇప్పుడు ఆకస్మాత్తుగా పింఛన్లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. మీ కుటుంబ వివరాలను పరిశీలించాక జిఒ నెం.174 ప్రకారం కింది కారణాల వల్ల మీకు పింఛన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసుల్లో పేర్కొన్న కారణాల్లో అత్యధికం 300 యూనిట్లు దాటినట్లు విద్యుత్‌ బిల్లు, నాలుగుచక్రాల వాహనాలు, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అధికారులు పేర్కొన్న కారణాలు ఏవీ వారికి వర్తించడం లేదు. అధికారులు నోటీసులు జారీ చేసిన పింఛన్‌దారులంతా పూర్తి అర్హత కలిగి ఉన్నారు. అధికారులు చూపిన కారణాలు అత్యంత దారుణంగా ఉన్నాయని చెప్పొచ్చు. హౌస్‌మేపింగ్‌లో డిలీట్‌ ఆప్షన్‌ తీసేసి, 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటే నోటీసులిచ్చిన పింఛన్‌దారులు ఏవిధంగా ఇస్తారో అధికారులు సమాధానం చెప్పాలి. జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. పింఛన్ల సంఖ్య పెరగకుండా రకరకాల కారణాలు చూపి ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. కుమారులకు కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే ప్రత్యేక రేషన్‌కార్డు ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు సంబంధించిన పింఛన్‌ ఆపేయడం, తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, అన్నకు ప్రత్యేక రేషన్‌కార్డు ఉన్నా పింఛన్‌ నిలిపివేయడం, కుటుంబ సభ్యుల్లో వేరొకరు నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేస్తే రేషన్‌కార్డులు ప్రత్యేకంగా ఉన్నా పింఛన్‌ ఆపేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ప్రభుత్వంలో ప్రజాసాధికారిత సర్వేలో కుటుంబ సభ్యులందరినీ కలిపి హౌస్‌హోల్డ్‌ మేపింగ్‌ చేశారు. ఇది జరిగి ఎనిమిదేళ్లు దాటిపోయింది. హౌస్‌హోల్డ్‌ మేపింగ్‌లో డిలీట్‌ ఆప్షన్‌ ఇవ్వకుండా పింఛన్లను ఆపేస్తున్నారు.
ఆధారాలు ఇచ్చినా ప్రయోజనం శూన్యం
నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు నోటీసులు ఇవ్వడంతో రవాణాశాఖ కార్యాలయం నుంచి వాహనం లేనట్లు లేఖ తెచ్చి బాధితులు అధికారులకు ఇస్తున్నారు. విద్యుత్‌ బిల్లు 300 దాటలేదని వివరాలతో విద్యుత్‌శాఖ నుంచి లేఖ తెచ్చినా, భూములు లేవని రెవెన్యూ అధికారుల నుంచి ఆధారాలు తెచ్చి అధికారులకిచ్చినా పింఛన్‌ పునరుద్ధరణ జరగడం లేదు. అందుకు కారణం హౌస్‌హోల్డ్‌ సర్వేలో డిలీట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోడమే. అసలు విషయాన్ని పక్కనపెట్టి 15 రోజుల్లో అర్హత నిరూపించుకోవాలని అధికారులు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. నోటీసులిచ్చిన పింఛన్లు అన్నీ ఇదేతీరుగా ఉన్నాయి. వెంటనే హౌస్‌హోల్డ్‌ సర్వేకు సంబంధించి డిలీట్‌ ఆప్షన్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు ఆపి పింఛన్‌ నిలిపివేస్తూ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
పింఛన్‌ నిలిపివేస్తే పోరాటమే
అల్లాడి నటరాజు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు
వికలాంగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించకపోవడంతో పెన్షన్‌ ఇస్తున్నారు. పెన్షన్‌ ఇవ్వడం ప్రభుత్వ కనీస బాధ్యత. వికలాంగులకు సమాన భాగస్వామ్యం ఇవ్వాలని చట్టం చెబుతోంది. చట్టాలను పక్కన పెట్టి వికలాంగుల పెన్షన్‌లు తొలగిస్తున్నారు. ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకుని పెన్షన్లను కొనసాగించాలి. లేకపోతే వికలాంగులంతా ఐక్యంగా పోరాటానికి దిగుతాం.