Nov 08,2023 00:29

మెగా చెక్కు అందచేస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తదితరులు

ప్రజాశక్తి-గుంటూరు : రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా కలెక్టర్‌ యం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నుండి సిఎం జగన్మోహన్‌రెడ్డి వరుసగా ఐదవ సంవత్సరం వైయస్సార్‌ రైతు భరోసా, పీయం కిసాన్‌ పథకం రెండవ విడత నిధులను రైతు ఖాతాలకు జమ చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని గుంటూరు కలెక్టరేట్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఐదవ సంవత్సరం రెండో విడత రైతు భరోసా, పీయం కిసాన్‌ పధకం ద్వారా 1,26,030 మంది రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి వ్యయం కింద రూ.51.60 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు భరోసా రైతులకు నాణ్యమైన వ్యవసాయ పనిముట్లు సమకూర్చుకొని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంద న్నారు. 2019 నుండి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ పథకం ద్వారా నిధులు రైతులకు నేరుగా అందచేస్తున్నట్లు చెప్పారు. 2019 నుండి ఇప్పటి వరకు రైతులు, కౌలు రైతు కుటుంబాలను 768.69 కోట్లు డీబీటీ ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఈ ఏడాది రెండో విడతలో సుమారు 7 వేల మంది కౌలు రైతులకు సాయం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి శాలివాహన కార్పోరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, డైరెక్టర్‌ స్టేట్‌ ఉర్దూ అకాడమీ అబిదా బేగం, జీడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ రాతంశెట్టి సీతారామాంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఆత్మ పీడీ పి.రామాంజ నేయులు, ఉద్యాన శాఖ డీడీ బి.రవీంద్ర పాల్గొన్నారు.