Aug 12,2022 00:24

భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీలో పాల్గొన్న హెచ్‌పిసిఎల్‌ సిబ్బంది, యువత

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ : విశాఖ సాగరతీరం వేదికగా హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిసిఎల్‌) నిర్వహించిన త్రివర్ణ పతాక మహా ప్రదర్శన అందరిలో ఉత్తేజం నింపింది. 1230 అడుగుల పొడవైన, 375 మీటర్ల త్రివర్ణ పతాకంతో చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. హెచ్‌పిసిఎల్‌ ఇంతటి భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించడం ఇదే ప్రథమం. ఈ ర్యాలీ వైఎంసిఎ నుంచి ప్రారంభమై ఉడా పార్క్‌ వరకు సాగింది. కేరళ సంప్రదాయ వాద్యఘోషతో సారగతీరం ఉత్తేజితమైంది. హెచ్‌పిసిఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వి.రతన్‌రాజ్‌ ర్యాలీని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ దేశాన్ని ఐక్యం చేసేది త్రివర్ణ పతాకమన్నారు. దేశ ప్రజలకు గర్వకారణంగా ఇది నిలుస్తోందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని హెచ్‌పిసిఎల్‌ ప్రారంభించడం, అందరి సహకారం తోడవటం గొప్ప విషయమన్నారు. హెచ్‌పిసిఎల్‌ సిజిఎం (హెచ్‌ఆర్‌) కె.నగేష్‌ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. స్వాతంత్య్ర్ర సముపార్జనలో పాల్గొన్న యోధుల స్ఫూర్తిని, దేశభక్తిని నేటి తరానికి అదించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. జాతీయ జెండారు గౌరవించడం, విలువలను తెలుసుకోవడం ఎంతో ప్రధానమన్నారు. కార్యక్రమంలో హెచ్‌పిసిఎల్‌ ఉన్నతాధికారులు, సంస్థ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.