ప్రజాశక్తి - ఆరిలోవ : 12వ వార్డు పరిధి 1, 2, 21 నెంబర్ల సచివాలయాల ప్రాంగణంలో కొత్తగా మంజూరైన వితంతు, వికలాంగులు, వృద్ధాప్య ఫించన్లను మంగళవారం వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణి ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వార్డు పరిధిలోని ఏడు సచివాలయాలకు కలిపి 57 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అవ్వ, తాతలు పింఛన్లు తీసుకోవాలంటే కార్యాలయాల వద్ద పడిగాపులు కాసేవారన్నారు. జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు. అనంతరం కొత్తగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తి మందారెడ్డి, వార్డు అధ్యక్షులు కన్నేటి సుబ్బారెడ్డి, సిటీ యూత్ జనరల్ సెక్రటరీ చొక్కర శేఖర్, వంశీ యువసేన అధ్యక్షులు ధూళి రఘు తదితరులు పాల్గొన్నారు.










