ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శంబాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న ఒక కంటైనర్ ట్రక్కును మినీ బస్సు వెనుక నుంచి ఢ కొన్న ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 23 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారి, ఆరుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ముంబయికి 350 కి.మీ దూరంలో వైజాపుర్ ప్రాంతంలో ఆదివారం అర్ధ రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానలోని ఒక దర్గాను సందర్శించుకుని నాసిక్‌కు తిరిగి పయనమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఈ బస్సులో పరిమితికి మించి 35 మంది ప్రయాణీకులు ఉన్నారని గుర్తించారు.
ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
గతేడాది డిసెంబరులో ప్రధాని మోడీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. దీనిపై ఇప్పటివరకు సుమారు 900కిపైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.










