Aug 04,2023 14:34

రుద్రప్రయాగ్‌ (ఉత్తరాఖండ్‌) : ఉత్తరాఖండ్‌లోని వరదల వల్ల గౌరీఖండ్‌ సమీపంలో కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో దాదాపు 12 మంది గల్లంతయ్యారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. అలాగే ఈ వరదల వల్ల మూడు దుకాణాలు కొట్టుకుపోయాయని, గురువారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో.. వరదలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. రిలీఫ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. గల్లంతైన వారిని వెతకడం ప్రారంభించాయని, అయితే తప్పిపోయిన వారిలో ఇప్పటివరకూ ఎవరూ కనుగొనబడలేదని సర్కిల్‌ ఆఫీసర్‌ విమల్‌ రావత్‌ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. తప్పిపోయిన వారిలో నేపాల్‌కు చెందిన వారు కూడా ఉన్నారని.. వారి సమాచారం సేకరిస్తున్నట్లు రావత్‌ అన్నారు.
కాగా, వరదల్లో గల్లంతైన వారిలో వినోద్‌ (26), ములాయం (25), అషు (23), ప్రియాంషు చమోలా (18), రణబీర్‌ సింగ్‌ (28), అమర్‌ బోహ్రా, అతని భార్య అనితా బోహ్రా, వారి కుమార్తెలు, రాధిక, పింకీ బోహ్రా, కుమారులు పృథ్వీ (7), జటిల్‌ (6), వకిల్‌ (3)లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.