Aug 25,2023 22:01

అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

* తీరప్రాంత భూములు కార్పొరేట్లకు ధారాదత్తం
* అఖిలపక్ష సమావేశంలో నాయకులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
బలవంతపు భూసేకరణ, నిర్బంధాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 11వ తేదీన మూలపేటలో మహా ధర్నా చేపట్టేందుకు అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. మూలపేట పోర్టు బలవంతపు భూసేకరణ, పోర్టు నిర్వాసితుల సమస్యలపై నగరంలోని ఎన్‌జిఒ హోంలో అఖిలపక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో తీర ప్రాంత భూములను కార్పొరేట్‌ కంపెనీలకు తాకట్టు పెట్టేందుకు పెద్దఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. ముంపు ప్రాంతాల్లో నిర్వాసితుల కాలనీలు ఇవ్వడంలోనే ప్రభుత్వ డొల్లతనం కనబడుతోందని ఆక్షేపించారు. ఎటువంటి పునరుద్ధరణ కార్యాచరణ చేపట్టకుండా మూలపేట రైతుల పంటలను రౌడీమూకలతో ధ్వంసం చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. మూలపేట నిర్వాసితులకు మెరుగైన పునరావాసంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోర్టు నిర్మాణానికి మూలపేట అంత అనుకూల ప్రదేశం కాదని, ఇది సాంకేతికపరమైన అంశాల్లో పలుమార్లు తేటతెల్లమైందన్నారు. ఏడాదిలో కొన్ని నెలల పాటు తీర ప్రాంతాల్లో వీస్తున్న గాలులకు ఇసుక అధిక మొత్తంలో మేటలు వేస్తుందని, ఈ పరిణామం పోర్టుకు ఎంతమాత్రం పనికిరాదని సెంట్రల్‌ వాటర్‌ రీసెర్చ్‌ కమిటీ 1993లో నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వం నిర్వాసితుల ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. జిరాయతీ భూముల తరహాలోనే అసైన్డ్‌ భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి ముసుగులో వేలాది ఎకరాలను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచించాలని చూస్తున్నాయని విమర్శించారు. ఈస్ట్‌కోస్ట్‌ భూములతో పాటు నిర్వాసితుల భూములను అదానీ భూములుగా మార్చుకునేందుకు కుట్ర సాగుతోందన్నారు. జిల్లావ్యాప్తంగా ఆరు వేల ఎకరాల భూములను అదానీ కంపెనీకి కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. తీరప్రాంత భూములపై అదానీ కన్నేశారని, మూలపేట పోర్టు విషయంలోనూ అదే జరుగుతోందన్నారు. అక్కడ జరుగుతున్నది అభివృద్ధి కాదని, విధ్వంసం మాత్రమేనన్నారు. సెప్టెంబరు 11న అఖిలపక్ష నాయకులు మూలపేటలో పర్యటించి నిర్వాసితులకు అండగా నిలుస్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చాపర వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి, టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పేడాడ పరమేశ్వరరావు, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి సన్యాసిరావు, జనసేన పార్టీ నాయకులు కూర్మారావు, సంతబొమ్మాళి మాజీ ఎంపిపి జీరు భీమారావు తదితరులు పాల్గొన్నారు.