Nov 10,2022 23:45

సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో 11న వామపక్షాల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చేపట్టే 'మోడీ గో బ్యాక'్‌ నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఐకార్యాలయంలో పార్టీ నాయకులు వైఎన్‌ భద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయకపోవడమే కాకుండా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రయివేటుకు కట్టబెట్టాలని చూస్తున్న బిజెపికి నేతలకు, ప్రధాని మోడీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదన్నారు. అటువంటి ప్రధాని మోడీకి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం స్వాగతం పలకడం, చంద్రబాబు నోరు మెదపకపోవడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం కుంటుపడిందని, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సిపిఎం నాయకులు ఏ బాలకృష్ణ, ఆర్‌ శంకర్‌రావు, ఉమామహేశ్వరరావు, రాజు, సిపిఐ ఎంఎల్‌ నాయకులు అజరు కుమార్‌, ఆమ్‌ ఆద్మీ నాయకులు హరినాథ్‌బాబు, సిఐటియు నాయకులు శంకర్రావు, ఎఐటియుసి నాయకులు కోన లక్ష్మణ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దొరబాబు, కార్యవర్గ సభ్యులు కొడుకుల సన్యాసిరావు పాల్గొన్నారు.