* జీడికి రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలి
* రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: జీడి పక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు చెల్లించాలని, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ... 11న ప్రజాసంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మహా రాయబారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు తెలిపారు. నగరంలోని యూటియఫ్ కార్యాలయంలో ఎపి జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్ అధ్యక్షతన ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీడి పిక్కలు ధర పాతాలముకు పోతుంటే... జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్నదని అన్నారు. దీనికి ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. 2019లో 80 కేజీలు జీడి పిక్కలబస్తా రూ.14 వేలు ఉంటే... ప్రస్తుతం రూ.7 వేలుకు పడిపోయిందని అన్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా దోపిడీ గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి, మాది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న వైసిపి జీడి సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం జీడి పిక్కలు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం గడపగడపకు వెళ్లి చెప్తున్నారు మంచిదే... మరి జీడిపిక్కలు ధర పడిపోతే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అప్పుల పాలువుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కానీ, మత్స్స, పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వంతో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. గిట్టుబాటు ధరపైన ఆర్‌బికెల కొనుగోలు కోసం చేస్తున్న పోరాటానికి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలన్ని అండగా ఉంటామని చెప్పారు. జీడి రైతుల న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలియజేయాలని కోరారు. ఐదు నెలలుగా జీడి రైతులు గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేస్తుంటే... ఈ జిల్లాలో ఉండే మంత్రులకు గాని, శాసనసభ స్పీకర్‌కు గాని పట్టడం లేదని అన్నారు. కేరళ తరహాలో జీడి బోర్డు గాని, కార్పొరేషన్ గాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక జీడి పిక్కలు కొనుగోలు చేసిన తర్వాతనే ప్రభుత్వం విదేశీ జీడిపిక్కల దిగుమతికి అనుమతించాలని డిమాండ్ చేశారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని జీడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జీడి రైతులు ఒంటరిగా లేరని, పోరాటానికి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు మద్దతుగా ఉన్నారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ జీడి రైతుల పోరాటంలో కార్మిక సంఘాలతో ప్రత్యక్షంగా పాల్గొంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, మహేంద్ర తనయా రైతు సంఘం నాయకులు కొర్ల రామారావు, చౌదరి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు మత్స్యకార సంఘం జిల్లా కన్వీనర్ చింతపల్లి సూర్యనారాయణ, ఎఐకెకెఎంఎస్ కార్యదర్శి సురేష్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డి.చందు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, ఎఐటియుసి నాయకులు చిక్కాల గోవిందరావు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.ఆదినారాయణమూర్తి, రైతు సంఘం జిల్లా నాయకులు రామకృష్ణ, టి. భాస్కరరావు, రైతు కూలీ సంఘం నాయకులు కె.గురయ్య, ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు పురుషోత్తం, అభ్యుదయ రైతు సంఘం నాయకులు ఎం.జోగారావు, జీడి రైతు సంఘం నాయకులు కాంతారావు, శ్యామ్ పిస్టన్స్ యూనియన్ నాయకులు ఎన్.వి.రమణ, డోకలపాడు మాజీ సర్పంచ్ రామకృష్ణ, న్యాయవాది మైలుపల్లి పోలీసు పాల్గొన్నారు.










