
ప్రజాశక్తి-భవానీపురం
జాతీయ మైనారిటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న ఇందిరా గాంధీ స్టేడియంలో జరగనున్న వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. గురువారం స్థానిక భవానీపురంలో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మైనార్టీ సోదరులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ నెల 11న జరగనున్న సభను మైనారిటీలు విజయవంతం చేయాలని కోరారు. మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. గతంలో మైనారిటీలపైన చంద్రబాబు దేశ ద్రోహం కేసులు పెట్టారని గుర్తు చేశారు.మైనారిటీ సోదరులను చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.నేడు జగన్ మోహన్ రెడ్డి మైనారిటీలను అక్కున చేర్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ ఖాజా, ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు గౌస్ మొహిద్దిన్,41వ డివిజన్ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ అకిబ్ అర్షద్, జిఎంసి బాష తదితరులు పాల్గొన్నారు.